వైకుంఠ ఏకాదశి
Ekadasi Fasting వైకుంఠ ఏకాదశి.. ఉపవాస దీక్షతో ఈ ఫలితాలు
Samayam Telugu | Updated: 06 Jan 2020, 08:15:00 AM
ఏడాది పొడువునా వచ్చే 24 ఏకాదశలలో అత్యంత ముఖ్యమైనది ముక్కోటి ఏకాదశి. ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. అందుకే వైష్ణవ భక్తులు ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు.
ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలనుకునే భక్తులు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి, రాత్రి జాగరణ ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాస దీక్షను ముగిస్తారు. ఉపవాస దీక్ష వెనుక పరమార్థం దాగి ఉంది.
సుదీర్ఘ సమయం ఉపవాసంతో ఉన్నప్పుడు శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించడం వల్ల జీర్ణవ్యవస్థ అస్థవ్యస్తమవుతుంది. కాబట్టి ద్వాదశి రోజున మితంగా ఆహారం తీసుకోవాలి. అంటే దశమి రోజున మొదలైన ఉపవాస వలయం ఏకాదశి చుట్టూ పరిభ్రమించి ద్వాదశి నాటికి ముగుస్తుందన్నమాట. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పాలు, పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి దీనితో చేసిన పదార్థాలను భుజించకూడదనేది పండితుల మాట.
ఏకాదశి రోజు ఉపవాస నియమం వెనుక ఒక తాత్విక ఉద్దేశం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో మనుషుల మీద చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుందని నమ్మకం. ఆ సమయంలో జీర్ణ సంబంధ వ్యాధులు, మనసులో ఆందోళనలు లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయని భావిస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణల వల్ల రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు మనసు, శరీరం సన్నద్ధంగా ఉంటాయి. ఆ సమయంలో మనసుని ఆ భగవంతుని మీద లగ్నం చేస్తే పుణ్యంతోపాటు పురుషార్థం లభిస్తుంది.
Comments
Post a Comment